Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page

ఆనంద తాండవమూర్తి

నటరాజు తాండవం చేసేటప్పుడు పతంజలి, వ్యాఘ్రపాదుడు, నందికేశ్వరుడు, భృంగి అనే నలుగురు ప్రక్కల నిలిచి ఆ ఆనందనర్తనంచూచి హృదయం పొంగిపోతూ వుండగా ఆనందంతో తలమునుకలుగా ఉంటారట.

'శివ నర్తనం ఒక చిదంబరమందేనా? వేరు చోటులలో లేదా? అన్న ప్రశ్న కలుగవచ్చు. 'సూర్యుడు చిదంబరంలో ఉదయిస్తాడు' అని అంటే మన ఊరిలోనూ ఉదయిస్తాడనియే అర్థం. సూర్యచంద్రు లన్నిచోటులలోనూ ఉదయించినట్లే ప్రదోషసమయంలో ఈశ్వరుడొక చిదంబరంలోనే యేమి అన్ని యెడలనూ నర్తనం చేస్తాడు. విశ్వమునంతా తన నర్తనంతో నింపుతాడు.

పతంజలి, వ్యాఘ్రపాదుడు అనేవారు మహం్షులు. నంది, భృంగి అనేవారి దేవాంశలు. వీరిద్దరూ ఆరుగాలమూ ఈశ్వరుని అనువర్తించి ఉండేవారు. పతంజలి, వ్యాఘ్రపాదుడూ నర్తనసమయములో మాత్రమే ఉండేవారు.

శివనర్తనపు లయ, తాళగతుల ననుసరించి పతంజలి ఒక స్తోత్రం రచించాడు. ఆయన ఆదిశేషుని అవతారమట. దేహము సర్పదేహముగానూ, తల మనుష్యుని తలగానూ ఉన్న చందముగా ఆయనను శిల్పులుకూడా చిత్రిస్తారు. వ్యాఘ్రపాదులకు పులికాళ్ళు, మనుజముఖం. పులిపాదములు రెండూ భయము కలిగించేవయినా తమతమ స్వభావం మరచి శివతాండవంచూచే ఔత్సుక్యంలో ఆనందపు పొలిమేరలు దాటిపోతూ ఉంటవి.

'నే నెట్లా ఉంటే మీకేం? మీ లోటు మీకు తెలియదు. మీకు కన్నులు లేవు. చెవులు లేవు. తాండవం చూసేటప్పుడేమో చెవులతో తాళగతులు వినలేరు. చెవులతో వినేటప్పుడేమో సరిగ చూడలేరు. నాకు అలాకాక వీనులూ, కన్నులూ ఒకే ఇంద్రియం కావడంవల్ల 'వీనుకంటి' అని పేరు పొందిన నేను వీనుకంటి తొడవుగా గల భగవంతుని-శివుని నర్తన నైపుణ్యమునూ తాళసరళినీ ఒకేఒక అవయవంతో అనుభవిస్తాను. అంత అదృష్టం మీకేదీ?' అని పతంజలి అన్నాడట.

వ్యాకరణానికి మహాభాష్యం వ్రాసిన మహానుభావుడు పతంజలి. నటరాజుయొక్క తాళస్వరాల కనుగుణంగా మాహేశ్వరసూత్రా లేర్పడ్డవి. వానివల్లనే వ్యాకరణానికి భాష్యం వ్రాయడానికి వీలయింది.

ఈశ్వరుడేదో నన్నిట్లా పుట్టించాడు. నాకు కొమ్ములూ కాళ్ళూ ఉంటేనేం లేకుంటే నేం? నాకే కాదు, నేను చేసిన స్తోత్రానికిగూడా లేవు' అని పతంజలి అన్నాడట.

'బాగు బాగు. ఈశ్వరుడు ఆకారమే నీకీరీతిగా అనుగ్రహించా డంటే, నీవు వ్రాసిన స్తోత్రానికిన్నీ ఈలాటి ఆకారమేనా? ఏదీ కొమ్ములూ కాళ్ళూ లేని ఆ ఆకారం?

అక్షరాలకు మనం చేర్చే దీర్ఘాలు పాదాలని చెప్పవచ్చు. ఏకారైకారాలూ ఓకారౌకారాలూ కొమ్ములవి అనుకోవచ్చు. హ్రస్వాలతో శ్లోకాలు వ్రాస్తే దానికి కాళులూ కొమ్ములూ లేని శ్లోకాలని అనవచ్చు. పతంజలి వ్రాసిన తాండవస్తోత్రంలో అన్నీ ఇలాటివే.

అనంత నవరత్న విలనత్కటక
కిఙ్కిణి ఝలం ఝలఝలంఝలరవమ్‌
ముకుంద విధిహస్తగత మర్దల
లయధ్వని ధిమి ద్ధిమిత నర్తన పదమ్‌
శకుంతరథబర్హి నందిముఖ
దంతిముఖభృంగిరిటి సంఘనికటమ్‌
సనంద సనకప్రముఖ వందిత
పదం పరచిదంబరనటం హృది భజ.
నర్తించే సమయంలో ఆయన పాదాలవలన పుట్టే ఝలంఝలధ్వనులు ఈశ్లోకంలో మనకు వినబడుతూ ఉన్నవీ శ్లోకపునడకగూడా ఈశ్వరుని నర్తనంవలెనే ఉన్నది.

'ముకుంద విధిహస్తగత మర్దల
లయధ్వని ధిమిద్ధిమిత నర్తన పదమ్‌'

బ్రహ్మయున్నూ, విష్ణువున్నూ మద్దెల వాచగా ఈశ్వరుడు ఆ తళగతులనుబట్టి 'ధిమిద్ధిమి' అని నర్తనం చేస్తాడు. ఈ నర్తనాన్ని చూచేవారు నంది, దంతి, ముఖుడు, భృంగిరిటి వీరందరూ పతంజలిని పరిహసించినవారే. అందుచేత వారినందరనూ చేర్చే పతంజలి శివస్తుతి చేశాడు.

''సనంద సనక ప్రముఖి వందిత పదం''

నటరాజు సనందనాదులచేత నమస్కరింపబడిన పాదాలు కలవాడు. ఆ నటేశుడు 'ఆనందమే రూపెత్తిందా' అనేటటులు కుంచితపాదుడై నృత్యం చేస్తాడు.

''పర చిదంబర నటం హృది భజ''

పరతత్త్వమయిన నటరాజును హృదయంలో సేవించువా'' అని ఈ శ్లోకం చెబుతూంది. ఇట్టివే ఎనిమిది శ్లోకాలుతో ఈ స్తుతి. వానిలో ఇది ఒక శ్లోకం.

హరం త్రిపురభంజన మనంతకృత

కంకణ మఖండదయ మంతరహితమ్‌

విరించి సురసంహతి పురందర

విచింతితపదం తరుణ చంద్రమకుటమ్‌

పరం పరం పదవిశకండితయమం

భసితమండితతనుం

మదన వంచన పరమ్‌

చిరంతన మముంప్రణత సంచితనిధిం

పరచిదంబరనటం హృది భజ.

హరుడంటే హరించేవాడని అర్థం. ఈశ్వరుడు దేనిని అపహరిస్తుడు? భక్తుల తాపత్రయాన్నీ కష్టాలనూ దుఃఖాలనూ పాపాలనూ ఈ మొదలయినవాని నన్నిటినీ మొదట హరించుకోపోయి పిమ్మట వారికి భక్తి పెరిగిన తరువాత భక్తి పూర్ణములయిన వారి హృదయాలను అపహరించుకొని పోతాడు. జ్ఞానసంబంధులు 'మానసచోరా' అని ఈశ్వరుని సంబోధిస్తారు. ఆ ఈశ్వరుడు ప్రలయసమయాన చరాచరాలయాన భూతాల నన్నిటినీ తనలో ఇముడ్చుకొంటాడు. ఇట్లా అన్నిటినీ హరించుకొని పోయేవాడు హరుడు.

'హరం త్రిపురభంజన మనంతకృతకంకణ

మఖండదయ మంతరహితమ్‌'.

ఈశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశాడని స్థూలంగా ఒక పురాణగాథ ఉన్నది: మూడుకోటలుగల ఒక పట్నంలో మూగురు రక్కసులున్నారు. వారివల్ల దేవతలకూ మానవులకూ పెక్కు ఉపద్రవాలు కలిగెయ్‌. వీరి సంహారం చేయడానికి ఈశ్వరుడే సమర్థుడని తీర్మానించుకొని ఆ దేవతలూ మానవులూ తాముగూడా సహాయం చేస్తామంటూ శివునకు విన్నవించుకున్నారు. భూమిరథంగానూ, వేదాలు గుణాలుగానూ, మహావిష్ణువు బాణంగానూ శివునకు పరికరాలుగా ఏర్పడినవి. ఆయనయు త్రిపురసంహారంకోసం బయలుదేరుతూ ఇట్లా చింతించాడు: మన పనికి ఎంత మంచి పరికరాలూ! భూమే రథం. అది కదలనిది. సూర్యచంద్రులు దానిచక్రాలు. ఒక చక్రం క్రిందికి పోతే ఇంకో చక్రం మీదికి. ఒకటి ముందుకు సాగితే ఇంకోటి మాటాడకుండా వెనక్కి. బాణం చూదామా విష్ణువు. ఆయన సదా యోగనిద్రలో ఉంటాడు. ఇట్టి పరికరాలతో నా నేను త్రిపురాసురసంహారం చేసేది? ఇలా యోచిస్తుండగా వారికి నవ్వు వచ్చింది. నవ్వారో లేదో ఆనవ్వు బలిమి ఏలాటిదో త్రిపురాలూ ఆ క్షణానే బూడిద ఐనై అని ఒక కథ.

మన దేహమే పట్టణం. మొత్తమ్మీద గమనించి చూస్తే మన దేహంలో మూడు భాగాలు ఉన్నై. చేతులూ కాళులూ నరాలూ ఎముకలూ మాంసమూ రక్తమూ ఇవన్నీ కలిసి స్థూల శరీరం ఒకటి. చూచే శక్తి, వినేశక్తి, మొదలయిన పలుతెలగుల శక్తులు ఉన్నవి. మనోబుద్ధి చిత్తాహం కారాలనే నాలుగు మనోభాగాలున్నవి. 'ఏదేనొక విషయమును ఎట్లా చేయడం?' అని ఆలోచించి నిశ్చయించేది బుద్ధి. ధృతితో కొనసాగించేది చిత్తం. 'నేను చేస్తున్నాన'నే తలపు అహంకారం. 'ఈ పని ఎట్లా నెరవేరుతుందా' అని పరితపించేది మనస్సు. ఇట్లా పలుతెరగులయిన అంతశ్శక్తి సముదాయానికి సూక్ష్మశరీర మని పేరు. నిద్దర పోయేటప్పుడు అంతా సురిగిపోయి ఒకటే అంధకార మవుతుంది. నిద్దర పోయేటపుడు కనులు మూసియున్నా తెరవబడివున్నా చూడడమనేది లేదు. కాని నిద్రాసమయంలో దేహంలో ఒక శక్తి, ఆనందాన్ని స్ఫురింపజేసే శక్తి ఒకటి ఉంటుంది. అలా ఆనందం పొందే శరీరాన్ని కారణ శరీరం అని అంటారు. ఈ మూడు శరీరాలు పరమాత్మస్వరూపంలో కలసి ఉన్నవి. ఈ మూడూ హతమయితే మనకూ ఆ మూడింటికీ సంబంధమే ఉండదు. అప్పుడు ఆనందమే ఆనందం. ఈ త్రిపుర సంహారాన్ని నవ్వుతూ నవ్వుతూ చేయాలి. నవ్వుచేతనే కష్టాల నన్నిటిని దుఃఖాల నన్నిటినీ సంహరించి ఆనందంగా ఆనందస్వరూపంలో ఐక్యం కావచ్చు. ఇది సూక్ష్మంగా ఈ కథకు అంతరార్థం. 'అనంతకృత కంకణమ్‌' ఆయనచేతి అనంతుడే ఆదిశేషుడే. 'అఖండ దయ మంతరహితమ్‌'. ఆయన దయ అఖండమయినది. మన దయకు ఒక హద్దు ఉన్నది. ఆ హద్దు దాటితే కోపం, తిట్లూ మొదలు వేస్తాం. ఈశ్వరుని దయకు మన దయకువలె ఒక హద్దులేదు. ఈశ్వరునివలె ఈశ్వరుని దయకున్నూ తుదయున్నూ మొదలున్నూ లేవు.

'విరించి సురసంహతి పురందర విచింతితపదం తరుణ చంద్రమకుటం' ఇంద్రుడు మొదలుగాగల, సకలదేవతలచే చింతింపబడిన పదపద్మములు కలవాడు; బాలచంద్రుని జటా మకుటంలో ధరించిన తరుణందు శేఖరుడు.

చిదంబరంలో నృత్యం వర్ణించిన శ్లోకం ఇది. నాయన మ్మార్లు (శివభక్తులు) ఆళ్వార్లు (విష్ణుభక్తులు) ఏ క్షేత్రం దర్శనం చేసికొనడానికి పోతే ఆ క్షేత్రంలో ఉండే ఈశ్వరుని స్తోత్రం చేయడంవాడుక. ఆస్తోత్రాలలో క్షేత్రౌచిత్యంగూర్చిన స్తుతిగూడా ఉంటుంది. ఆ క్షేత్రంలో ప్రతిధ్వినించే వేదాధ్యయనమూ హోమధూమమూ క్షేత్రవాసులు చేసే దానధర్మాల గొప్పదనమూ ఆయా స్తుతులలో ఉంటుంది. నాలుగు వేదాలూ ఆరు ఆగమాలూ అరువది నాలుగు కళలూ వీనితో కలకలలాడే ఆ వూళ్లో విభూతి పెట్టుకుని హోమపు పొగలు నలుదెసలా వ్యాపించేటటులు ప్రేల్చే ఆంతరింగికులచే అర్చన చేయబడే ఓ ప్రభూ! అని పెక్కు స్థలాలలో 'అప్పర్‌' సంకీర్తన చేశాడు. ఆళువారులు సైతం స్త్రీలు తమ భర్తలకు తమ్ము ఎట్లు ఆత్మార్పణ చేసికొంటారో అట్లా నాయికా నాయకభావంతో తమ్ము అర్పణ చేసికొని ఎన్నో గీతాలు గానం చేశారు.

శరీరం ఉన్నాసరే పోయినాసరే అని అమరణాంతమూ అవమానాలూ లెక్కచేయక భర్త ఇచ్ఛననుసరించి నడచుకోవడమే విధ్యుక్తమయిన ధర్మం. పెనిమిటిచేసే పనులన్నీ సరియైనవా కావా అని ఆలోచించకుండా తనకు నియోగించిన పనులన్నీ చేసేయడమే విధి అనే మనోభావమే పతివ్రతలది.

ఒక పతివ్రత తన్నెక్కడికో తీసికోపొమ్మని భర్త చెప్పినందువల్ల ఆతనిని గంపలో పెట్టుకొని మోసుక పోతూవుంది. నడుమ దారిలో కొఱతమానొకటి ఉంది. ఒకముని కొఱతలో ఉసురుసురుమంటూ బాధపడుతున్నాడు. గంపలో ఉన్నవాని కాలు ఆమునికి తగిలి ప్రాణాంతకమయిన వేదన కలిగించింది. ముని ఆ వేదనకు తాళ##లేక శపించాడు. గంప మోసుకొని పోతున్న ఆమె తన పాతివ్రత్యమహిమచే ఆ ముని శాపాన్ని పనిచేయనీకుండా చేసిందిట. ఈరీతిగా ''ఈశ్వరుడొకడే పురుషుడు, తక్కుగలవారందరూ స్త్రీలే'' అని భగవానుని పురుషునిగానూ తమ్ము ఆడు వారిగానూ భావించుకొని ఆళువారులు భక్తి నెరపే స్థితి నాయికా నాయకభావం. ఈ భావంతో భక్తి శృంగారాలతో ఆళువారులు వ్రాసిన పాశురా లెన్నో ఉన్నవి.

మీరాబాయి ఇట్లే తన్ను గిరధరునకే అర్పించుకొన్నది. ఆమె ఉత్తరమధురను విడిచి కృష్ణభగవాన్య విలాసాలకూ స్మృతులకూ ఆటపట్టయిన బృందావనానికి తరలి పోయింది. ఉత్తరదేశంలో సూరదాసువలె వల్లభాచార్యులనే గురువులొక కాలంలో ఉన్నారు. ఆసమయంలో వారున్నూ బృందావనానికి వేంచేశారు. మీరాబాయి వల్లభాచార్యుల వారిని చూడగోరి అనుజ్ఞ ఇమ్మని వార్త పంపింది. ''ఆడుదాని మొగం చూడనొల్లన'ని వల్లభాచార్యులు బదులు పంపారట. 'స్త్రీని చూచేది లే'దని ప్రతిజ్ఞ చేసినవానికి ''పురుషుడు'' అనే తలపు ఉంటుంది గదా! మీరాబాయి ఈ మాట విని-''ఈ బృందావనములో ఉండే పురుషుడొకడే. అతడు కృష్ణుడు. తక్కినవా రందరూ స్త్రీలే. అట్లాకాక ఎవరికయినా తాను పురుషుడనే భావం ఉంటే అతడు బృందావనమునుంచి బయటికి వెళ్ళిపోవచ్చును'' అని మీరా తిరిగి బదులు పంపినదట. దాని విన్న వల్లభాచార్యులు ''ఈమె గొప్ప జ్ఞానివలె ఉన్నదే, అని ఔరా అపచారం'' అని దుఃఖించి ఆమె కడకు వెళ్ళి నమస్కరించినారట! అటుపిమ్మట వీరిరువురూ పరస్పరము గురువులైర''ని మీరాబాయి చరిత్రలో వింటున్నాము.

ఈ విధంగా నాయికా భావంతో ఆళ్వార్లు సయితం కవనాలు చెప్పారు. ఆళ్వారు అంటేనే యువతి అని అర్థం. వేయేండ్లనాటి పాత శిలాశాసనాలు చూస్తే దాంట్లో ఫలానా రాజు ఫలానా ఆళ్వారును పెండ్లి చేసికొన్నాడు'' అని చెక్కబడి ఉంటుంది. అందుచేత ఉత్తమలక్షణాలు కల స్త్రీలను ఆళ్వారు లని అంటూ ఉండేవారని తెలియవచ్చు. నాటి నుండి నాయికా నాయకాభావ మవలంబించి భక్తితో కొలచినవారికి ఆళ్వార్లని పేరు వచ్చింది.

విరహోత్కంఠిత యయిన తన కూతు ఏమేమి చేస్తుందో వాని గురించి ఆ కన్యతల్లి చెప్పిన చంద మొక యాళ్వారు గానం చేసియున్నారు. విభూతి తాల్చినవాడొకడు వీధిలో పోతూవుంటే ''అదిగో విష్ణుభక్తుడు వెళుతున్నాడనిన్నీ ఒకడు తులసిమాల వేసుకొని పోతూవుండగా 'అదిగో విష్ణుభక్తుడు వెళుతున్నాడ''నిన్నీ ఆ కన్య ఇట్లా అంతా విష్ణుమయంగా చూస్తున్న దని అ కన్నెతల్లి చెపుతూందట.

తులసిమాల వేసుకున్నవాడు విష్ణుభక్తుడు కావచ్చును గాని విభూతి పూసుకున్నవాడు విష్ణుభక్తు డెట్లా అవుతాడు? ఇందువల్ల ఆకాలంలో అందరూ విభూతి తాల్చే వారని తెలుస్తుంది. కంఠంలో తులసిమాల, దేహముమీద విభూతి, నాభిలో విష్ణునామం, నాలుకపై విష్ణునామం, హృదయంలో విష్ణుస్వరూపం. ఈ రీతిగా ఉండేవారని తెలస్తుంది.

'ఈ విరహోత్కంఠిత ఉన్మాదావస్థదాకా పోయి ఉండవచ్చు. దానివల్ల 'విభూతి తాల్చినవాడు విష్ణుభక్తుడని ప్రలాపించవచ్చు' అని వైష్ణవు లెవరయినా శంకచేయవచ్చు. అలా చేస్తే-''తులసిమాల తాల్చిన వానినిగూడా విష్ణుభక్తుడని ఆయమ్మ అంటూంది. ఇది పిచ్చిమాట కాదుగదా! అదేమిటి వెఱ్ఱికి వేయివిధాలు; ఒకటి సరిగా ఉండవచ్చు. ఒకటి అసందర్భంగా ఉండవచ్చు' అని అంటారా? ఉన్మాదస్థితిలో ఒకటి సరిగా చెప్పడమూ మరియొకటి బే సరిగా చెప్పడమూ అంటూ వుండదు. పురాకాలంలో అందరూ భస్మ తాల్చడమూ విష్ణునామకీర్తనం చేయడమూ సామాన్యపద్ధతి అని తోస్తుంది. ఇటీవల సద్గురు బోధేంద్ర స్వాములవారి కాలంలో గూడా భస్మధారణా హారినామకీర్తనా చేసేవారని వ్యక్త మవుతుంది. గోవిందపురం మరుందా నల్లూరు అనే ఊళ్ళలో మఠాలు ఉన్నవి. నేటికిన్నీ నామకీర్తనానికి ముందు బోధేంద్రస్వామికి నమస్కారం చేస్తారు,-

య స్యాంగం కనకాభ కాయసదృశం
ఫాలం త్రిపుండ్రాంకితమ్‌

వాణీ శ్రీరఘునాథనామసుధయా

ప్యార్ద్రా సకృద్ధారయా

చేత స్యంబుజలోచనో యదుపతిః

ఖేల త్యలం రాధయా

తం వై వేంకటరామదేశిక వరం

సర్వాత్మానా7హం భ##జే

నేటికిన్నీ భజన సమయంలో ఈ శ్లోకం చదువుకొంటున్నాం. ఫాలంమ్మీద విభూతి, నాభిలో విష్ణునామం. వీరికి వెంకటరామ నామధేయం. వీరికి మొనమొన్నటి వారు సాయం చేద్దామని తంజావూరు మహారాజుగారు ద్రవ్యమీయబోగా శ్రీ వెంకట రామదేశికులు నిరాకరించారట! అందుచేత మహారాజావారు శ్రీ వెంకటరామదేశికులు ఉంఛవృత్తికి వచ్చేటపుడు సాయం చేయవలసిందని మాన్యాలు వ్రాసిపెట్టి భాగవతపురాన్ని భక్తపురి అనే అగ్రహారంగా ఏర్పరచినటులు చెప్పుకుంటారు.

ఈ తత్త్వమునే ఆదిశంకరులున్నూ ఉపదేశం చేసుకుంటూవచ్చారు. వారవతారం చాలించుకొని కైలాసం పోడానికి ముందు శిష్యులందరూ చేరి - ''ఈశ్వర కృపను సులభంగా పొందడానికి తాము చేయు ఉపదేశం అనుగ్రహించండని ప్రార్థించారు. అప్పుడు వారు, -

'వేదో నిత్య మధీయతాం తదుదితం

కర్మ స్వనుష్ఠీయతామ్‌'

అని ప్రారంభించి అయిదు శ్లోకాలు వ్రాసియిచ్చారు. ''నిత్యమూ వేదాధ్యయనం చేసికొంటూవుండండి. ఎవరికర్మలు వారు చేసికోవడమే ఈశ్వరపూజ'' అని చెప్పారట.

''వేదో నిత్య మధీయతామ్‌''్స ''నిత్యమూ వేదాధ్యయనం చేయండి'' అని శంకరులు చెప్పారు. వేదాధ్యయనం చేస్తామని అనుకోండి; దీనికేమిటి ఫలం? కలి-ఉపద్రవం లేకుండాపోతుంది. వేదములు చెప్పిన కర్మలు చేసేవారి హృదయాకాశంలో ఈశ్వరుడు నృత్యం చేస్తాడు.

''పరం పదవిఖండితయమమ్‌'' పరమంటే అన్నిటిని మించిన గొప్ప వస్తువు. ''పద విఖండిత యమమ్‌''. యముని కాలదన్నినవాడు శివుడు. ''భసిత మండితతనుమ్‌'' బూడిదచే భూషితమయిన శరీరం కలవాడు. ఎట్టి, ఎంత వస్తువులయినా సరే ఏదో ఒకనాటికి బూడిద కావలసినవే. అయితే బూడిద మాత్రం బూడిదగానే ఉంటుంది. విభూతే శాశ్వత మయిన అలంకారం. నిత్యమయిన అలంకారం. 'శేక్కిళార్‌' అనేవారు ''అరవైమూవురు శివభక్తుల చరిత్ర. వీరందరూ శివునవలెనే విభూతిభూషితు లని వర్ణించారు. శేకిళ్తార్వారు సుందరమూర్తి ఇలా చెప్పారు. 'ఏయే చోట ఏయే భక్తులు మోక్షం పొందారో వారివారి కందరకూ నేను దాసుడను' అని చెప్పుకొన్నారు. ఇదేరీతిగా భక్తశిఖామణి త్యాగయ్యగారు 'ఎందరో మహానుభావులు వారి కందరకునూ వందనములు' అని కీర్తించారు.

'భసిత మండిత తనుమ్‌ మదన వంచన పరమ్‌ చిరంతన మముమ్‌' చిరంతనమ్స్‌ఎల్లపుడును ఉండునది. 'ప్రణత సంచిత నిధిమ్‌' నమస్కరించే వారిని కాచేనిధి-ఐశ్వర్యం పరమేశ్వరుడు భగవానుడు ఆనంద నర్తనం చేసేటప్పుడు వాచే మర్దళమును అనగా మద్దెలను, శుద్ధమర్దళం అని అంటారు. అపుడు అందర హృదయాలూ పరువులెత్తుతయ్‌. అప్పుడు చిత్తమూ మనస్సూ అణగుతయ్‌.

పసిబిడ్డలు సైతమూ ఆనందం పొంగి కట్టుబట్టలు విడిపోగా గంతులు వేస్తారు. ఈ రీతిగానే ఆనందం పొంగేటప్పుడు విశ్వజన సమ్మోహనంగా ఈశ్వరుడు సంధ్యాసమయంలో తాండవం చేస్తాడు. ఎంతో చింతతో వేగిపోతున్న మనం ఆ ఆనందాన్ని ఊహింపనయినా ఊహింపలేము.

ఈశ్వరుడు నృత్యంచేసే సమయం సంధ్యా. ఆ సంధ్యా సమయంలో ఈశ్వరధ్యానం చేస్తే మనశ్చాంచల్యం అడగి శాంతి అలవడుతుంది. నర్తననైపుణిలయకౌశల్యమూ ఏకకాలంలో ఆస్వాదించిన పతంజలి శివతాండవ స్తోత్రం చేశారు. దానికి నటేశాష్టకం అనిపేరు. శంభునటన మనిన్నీ దానికి మరియొక పేరు ఉన్నది. నేడు సోమవారం గనుక నేనున్నూ ఈశ్వరుని కొంచెం స్మరించి ఈ స్తోత్రం గురించి చెప్పాను.


Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page